తెలంగాణ లో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం

గత కొద్దీ రోజులుగా విపరీతమైన ఎండలతో అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజలు చల్లపడ్డారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మరో మూడు రోజులు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. వరంగల్‌ జిల్లా నర్సంపేటలో, ములుగు జిల్లాలోని వెంకటాపూర్‌, ములుగు, గోవిందరావుపేట, ఏటూరునాగారం, మంగపేట, మహబూబాబాద్ , ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కారేపల్లి , ఇల్లందు లలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కరీంనగర్‌లోని శంకరపట్నం, వేములవాడ, రుద్రంగి, చందుర్తి, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలోని మంథనిలో భారీ వాన పడింది.

ఇక ఏపీలోని శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ తెలిపింది. మరికాసేపట్లో ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలెవరూ చెట్ల కింద ఉండరాదని.. రైతులు, గొర్రెల కాపరులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.