డి.శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమం

మాజీ రాజ్యసభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. గత కొద్దీ రోజులుగా డీఎస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతంలోనే డీఎస్‌కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో పాటు పక్షవాతం కూడా సోకింది. మార్చి నెలలో తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో…సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స అందించడంతో కోలుకున్నారు. మరోసారి ఇప్పుడు అనారోగ్యానికి గురి కావడంతో హాస్పటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. తన తండ్రి ఆరోగ్యం క్రిటికల్‌గా ఉందని ఎంపీ అరవింద్ తెలిపారు. అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో ఆస్పత్రిలో చేర్పించామన్నారు.

డీఎస్ రాజకీయ రంగం విషయానికి వస్తే..ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్‌ రెండుసార్లు మంత్రిగా పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. డి.శ్రీనివాస్ రెండు సార్లు పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. 2004, 2009 ఎన్నికల సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు డిఎస్‌ అధ్యక్షుడిగా ఉన్నారు.

నిజామాబాద్‌ జిల్లా రాజకీయాలను సుదీర‌్ఘకాలం డిఎస్‌ శాసించారు. 1998లో తొలిసారి పిసిసి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 1983లో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన డి.శ్రీనివాస్ టిడిపి అభ్యర్ధి డి.సత్యనారాయణ చేతిలోఓడిపోయారు. 1989లో రెండోసారి పోటీ చేసినపుడు కాంగ్రెస్‌ పార్టీ తరపున గెలుపొందారు. 1994 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 1999,2004 ఎన్నికల్లో నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి గెలుపొందారు.

2009 సాధారణ ఎన్నికలతో పాటు, 2010 ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఇ.లక్ష్మీనారాయణ చేతిలో ఓటమి పాలయ్యారు. రెండోసారి పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన బాజీరెడ్డి గోవర్ధన్ చేతిలో ఓటమి పాలయ్యారు. టిఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసిన బాజిరెడ్డి గోవర్ధన్‌, డిశ్రీనివాస్‌ను ఓడించారు. 2018లో టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన డి.శ్రీనివాస్‌కు రాజ్యసభ సభ్యత్వం లభించింది.