కేసీఆర్ పాలనను అంతమొందించి రామరాజ్యం తీసుకురావాలి – ఎంపీ ధర్మపురి అరవింద్

రాష్ట్రంలో కేసీఆర్ పాలనను అంతమొందించి రామరాజ్యం తీసుకరావాలని పిలుపునిచ్చారు ఎంపీ ధర్మపురి అరవింద్. మునుగోడు సభలో మాట్లాడుతూ..కేసీఆర్ ఫై నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి మంచి చేస్తాడని భావించి ప్రజలు అధికారం ఇస్తే… రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని అరవింద్ మండిపడ్డారు. దేశంలో మిగతా సీఎంల కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్న కేసీఆర్… ప్రజల గురించి పని చేయడం మానేసి ఫాంహౌజ్ కే పరిమితమయ్యారు.

తన పాలనలో భూముల రేట్లు బాగా పెరిగాయని, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించామని చెబుతున్న కేసీఆర్… భూనిర్వాసితులకు పరిహారం ఎందుకు చెల్లించడంలేదని ప్రశ్నించారు. శివలింగంపై తేలులా, గర్భగుడిలో గబ్బిలంలా కేసీఆర్ మారారని ఆరోపించారు. మునుగోడు ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రోడ్డు రోలర్లా తొక్కాలని పిలుపునిచ్చారు. మునుగోడు మొనగాడు రాజగోపాల్ రెడ్డి అనిపేర్కొన్న అర్వింద్… ఉప ఎన్నికలో పాపాల భైరవుడు కేసీఆర్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

మునుగోడులో ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ప్రభుత్వం ఇప్పుడు అభివృద్ది పనులు చేపడుతోందని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ముంపు గ్రామాల్లోని వారికి పరిహారం, రోడ్లు వేయడం, పెన్షన్ లు ఇస్తున్నారని విమర్శించారు. రాజీనామా చేసింది మునుగోడు ప్రజలకే అని అందరికీ అర్థమైందన్నారు.

కేసీఆర్.. ప్రధాని మోడీ నీకు శత్రువు కావచ్చు.. కానీ దేశ ప్రజలందరికీ ఆయన నమ్మదగిన మిత్రుడు’ అని విజయశాంతి అన్నారు. మునుగోడు సభ లో ఆమె మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్న విజయశాంతి.. ఇందుకుగానూ ఆయనకు అభినందనలు తెలిపారు. దళిత బిడ్డను ముఖ్యమంత్రి చేయకుండా.. తెలంగాణ అమరవీరుల కలలను తుంగలో తొక్కిన కేసీఆర్ ను ప్రజలు సమర్ధించాల్సిన అసవరం ఏముందని ప్రశ్నించారు.