ప్రధాని మోడిపై రాహుల్‌ గాంధీ విమర్శలు

2016 నవంబర్‌లో తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం 2020లో భయంకరమైన ఫలితాలు..రాహుల్‌

rahul-gandhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి ప్రధాని మోడిపై విమర్శలు గుప్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థపై తాజాగా గురువారం ట్విట్టర్‌లో వీడియోను పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన వీడియోలో మాట్లాడుతూ.. నగదు లభ్యతపై మనుగడ సాగించే దేశ అసంఘటిత రంగానికి ఉద్దేశపూర్వకంగా హాని చేయడమే నోట్ల రద్దు వెనుక ఉన్న కేంద్ర ప్రభుత్వ ఎజెండా అని ఆరోపించారు. 2016 నవంబర్‌లో తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం 2020లో భయంకరమైన ఫలితాలు ఇచ్చిందని మండిపడ్డారు. భారత్‌ నగదు రహిత దేశం కావాలని మోదీ చెప్పారన్న రాహుల్‌ అలాగే జరిగితే చిరు వ్యాపారులు, రైతులు, కార్మికులు అంతమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేందుకే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. నోట్ల రద్దు కోట్ల మందిని కష్టాలకు గురి చేసిందని, నల్లధనం సమస్య పరిష్కారం కలుగలేదని, పేదలకు ఎలాంటి ప్రయోజనం కలుగలేదని స్పష్టం చేశారు. నోట్ల రద్దు వల్ల కోటీశ్వరులు మాత్రమే ప్రయోజనం పొందారన్నారు. వారి అప్పులను మాఫీ చేసేందుకు ప్రభుత్వం ప్రజల డబ్బును తీసుకుందని ఆరోపించారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/