మార్చి 25న ఇందిరా పార్క్ వద్ద ‘నిరుద్యోగ మహాధర్నా’

‘మా నౌఖరీ మాగ్గావాలె’ అనే నినాదంతో మార్చి 25న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగ మహాధర్నా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ణయించింది. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసును నిరసిస్తూ బీజేపీ మహా ధర్నా చేయనుంది. పేపర్ లీక్ ఘటనపై ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విషయమై కాంగ్రెస్, బీజేపీ సహా ఇతర పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. బండి సంజయ్ ఆధ్వర్యంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరుద్యోగులతో ఈ దీక్షను నిర్వహించనుంది. TSPSC పేపర్ లీకేజీలో కీలక పాత్ర ఉన్నందున మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేయాలని, కేసును సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, పరీక్షల రద్దుతో నష్టపోయిన విద్యార్థులకు రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలన్న డిమాండ్లతో ఈ మహాధర్నా జరగనుంది.

టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీ నేపథ్యంలో 30 లక్షల మంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. నిరుద్యోగులకు మద్దతుగావ వివిధ రూపాల్లో పోరాట కార్యక్రమాలను రూపొందించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా సాగర హారం, మిలియన్ మార్చ్ వంటి అంశాలు ఈ సందర్భంగా చర్చకొచ్చాయి. తొలుత ఈనెల 25న ఇందిరాపార్క్ వద్ద నిరుద్యోగ మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. TSPSC పేపర్ లీకేజీతో పాటుగా ఇతర అంశాలపై బండి సంజయ్ అధ్యక్షతన మార్చి 23న పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మాజీ ఎంపీలు వివేక్‌, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రవీంద్రనాయక్‌, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.