సుప్రీం తన తీర్పుతో ప్రజలకు న్యాయం చేసిందిః కేజ్రీవాల్‌

‘Democracy won’: Arvind Kejriwal after big SC win in ‘power’ tussle with LG

న్యూఢిల్లీః ఢిల్లీ పాల‌నా వ్యవ‌హారాల‌పై నేడు సుప్రీంకోర్టు కీల‌క తీర్పును వెలువ‌రించిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పుపై ఆప్‌ చీఫ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా ఈ సమస్యలతో పోరాడుతోందని అన్నారు. తాజా తీర్పుతో ఢిల్లీ ప్రజలకు న్యాయం చేసినందుకు సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్‌ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

‘సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. మా ప్రభుత్వం గత ఏనిమిదేళ్లుగా ఈ సమస్యతో పోరాడుతోంది. సుప్రీం తన తీర్పుతో ప్రజలకు న్యాయం చేసింది. ప్రజాస్వామ్యం గెలిచింది. ఢిల్లీ అభివృద్ధికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఈ తీర్పుతో ఇప్పుడు ఢిల్లీ అభివృద్ధి వేగం పెరగనుంది. నాకు మద్దతిచ్చిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా ప్రభుత్వం ఢిల్లీలో కొత్త గవర్నెన్స్‌ మోడల్‌ను ప్రవేశపెడుతుంది. కొందరు అధికారుల వల్ల నగరంలో పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు బాధ్యతాయుతమైన అధికారులకు విధులు నిర్వహించే అవకాశం కల్పిస్తాం’ అని కేజ్రీవాల్‌ తెలిపారు. మరోవైపు సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను అరవింద్‌ కేజ్రీవాల్‌ కలిసే అవకాశం ఉంది.