రాహుల్ గాంధీకి ఢిల్లీ యూనివర్సిటీ నోటీసులు!

Delhi University to send notice to Rahul Gandhi cautioning him against ‘unauthorised’ visit to campus in future

న్యూఢిల్లీః కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘మోడీ’ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యల కేసులో దోషిగా తేలి.. లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే.ఈ కేసులో ఆయనకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. ఇవే వ్యాఖ్యల కేసులో దేశంలోని పలు ప్రాంతాల్లో రాహుల్‌పై కేసులు నమోదయ్యాయి.

అయితే ఇప్పుడు తాజాగా ఢిల్లీ యూనివర్సిటీ రాహుల్‌కు నోటీసులు పంపేందుకు సిద్ధమైంది. భవిష్యత్తులో క్యాంపస్‌లోకి అనధికారికంగా అడుగుపెట్టకుండా ఉండేలా ఈ నోటీసులు జారీ చేయనుంది. కాంగ్రెస్ నేత ఇటీవల హాస్టల్ విద్యార్థులను కలిసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బహుశా ఈ రోజు ఆయనకు నోటీసు పంపే అవకాశం ఉందని ఢిల్లీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వికాశ్ గుప్తా తెలిపారు.

రాహుల్ ఇలా అనధికారికంగా సందర్శించడం వల్ల విద్యార్థుల భద్రత ప్రమాదంలో పడుతుందని అన్నారు. యూనివర్సిటీకి రావాలనుకున్నప్పుడు సరైన ప్రొటోకాల్ అవసరమని చెప్పారు. గత శుక్రవారం యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెన్స్ హాస్టల్‌ను సందర్శించిన రాహుల్ వారితో కలిసి భోజనం చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.