ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరొకరు అరెస్ట్

దేశాన్ని కుదిపేస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. కేసులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. మంగళవారం బుచ్చిబాబును హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు వెంటనే అతన్ని ఢిల్లీ తరలించారు. గతంలో బుచ్చిబాబు ఇంట్లో సీబీఐ సోదాలు జరపగా.. ఢిల్లీకి పిలిపించి పలుమార్లు ప్రశ్నించింది. ఇప్పుడు ఏకంగా అరెస్ట్ చేయడం ఈ కేసులో కీలకంగా మారింది. ఇది జరిగిన కాసేపటికే మరొకర్ని సిబిఐ అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో గౌతమ్ మల్హోత్రాను బుధవారం ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీకి చెందిన బ్రికంక్ కో సేల్స్ సంస్ధకు డైరెక్టర్‌గా ఆయన ఉన్నారు.

ఒకేరోజు ఇద్దరి అరెస్ట్‌లతో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు మరింత స్పీడ్ చేసినట్లు అర్ధమవుతుంది. ఇటీవల ఈ కేసులో రెండో ఛార్జ్‌షీట్‌ను కోర్టులో సీబీఐ దాఖలు చేసింది. ఇందులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్లను ప్రస్తావించడం దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఆలాగే ఏపీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో పాటు వైస్సార్సీపీ నేతలతో సంబంధం కలిగి ఉన్న పలువురు వ్యక్తుల పేర్లను ఛార్జిషీట్‌లో సీబీఐ ప్రస్తావించింది.