ఢిల్లీ అవసరమైనదాని కంటే ఎక్కువ ఆక్సిజన్ డిమాండ్
దీంతో 12 రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత..ఆక్సిజన్ ఆడిట్ కమిటీ స్పష్టం
Delhi govt sought 4 times more oxygen than it needed during 2nd wave, says SC audit panel
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం కరోనా రెండో వేవ్ సమయంలో అవసరమైనదాని కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఆక్సిజన్ డిమాండ్ చేసిందని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఆడిట్ కమిటీ స్పష్టం చేసింది. ఏప్రిల్, మే నెలల్లో ఢిల్లీలో భారీగా కేసులు నమోదైనప్పుడు ఆక్సిజన్ అందక ఎంతో మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కేజ్రీవాల్ ప్రభుత్వం, కేంద్రం మధ్య మాటల యుద్ధం నడిచింది. అప్పుడు ఢిల్లీ హైకోర్టు జోక్యంతో ఇతర రాష్ట్రాలకు సరఫరాను తగ్గించి ఢిల్లీకి ఎక్కువ ఆక్సిజన్‌ను పంపింది కేంద్ర ప్రభుత్వం.
కానీ తాజాగా ఆడిట్ కమిటీ రిపోర్ట్ మాత్రం ఢిల్లీ ప్రభుత్వ తీరును తప్పుబట్టేలా ఉంది. ఆ సమయంలో ఢిల్లీకి 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉండగా.. కేజ్రీవాల్ ప్రభుత్వం మాత్రం 1200 మెట్రిక్ టన్నులు డిమాండ్ చేసిందని తేల్చింది. ఢిల్లీ వల్ల 12 రాష్ట్రాల్లో తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఏర్పడిందని స్పష్టం చేసింది. మే 13వ తేదీన కూడా ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ, ఎయిమ్స్‌లాంటి ప్రభుత్వ దవాఖానాలతోపాటు వివిధ ప్రైవేటు హాస్పిటల్స్‌లో సరిపడా ఆక్సిజన్ ఉన్నందుకే ఆక్సిజన్ ట్యాంకర్లు లోడ్ ఖాళీ చేయలేదని తెలిపింది.
ఏప్రిల్ 29 నుంచి మే 10 మధ్య ఢిల్లీలో ఆక్సిజన్ వినియోగ లెక్కలను సవరించాలని, కొన్ని హాస్పిటల్స్ వీటిలో భారీ తప్పిదాలు చేశాయని కమిటీ తేల్చి చెప్పింది. నిజానికి హాస్పిటల్స్ 1140 మెట్రిక్ టన్నులు వినియోగించినట్లు చెప్పగా.. లెక్క సరిచేసిన తర్వాత అది 209 మెట్రిక్ టన్నులుగా తేలిందని తెలిపింది. డిమాండ్‌ను సరిగా లెక్కించలేక ఢిల్లీ ప్రభుత్వం ఇలా అవసరం ఉన్నదాని కంటే ఎంతో ఎక్కువ ఆక్సిజన్ అడిగిందని కమిటీ తేల్చి చెప్పింది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/