మరోసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Delhi CM Arvind Kejriwal skips third summons by ED in excise policy case

న్యూఢిల్లీః ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్ ఈ రోజు (జనవరి 3) కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరు కాలేదు. విచారణకు రమ్మంటూ ఈడీ పంపిన నోటీసులను ఆయన లెక్కచేయలేదు. ఈడీ నోటీసులు అందుకోవడం ఆయనకు ఇది మూడోసారి.. అయినా కేజ్రీవాల్ స్పందించలేదు. అయితే, ఈడీ నోటీసులు అక్రమమని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపిస్తోంది. పార్టీ నేషనల్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరుకాబోడని తేల్చిచెప్పింది. ఈమేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. లిక్కర్ మాఫియాకు అనుకూలంగా నిబంధనలు రూపొందించారని, మనీలాండరింగ్ కు పాల్పడ్డారంటూ ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను విచారించేందుకు పిలిచింది.

ఈ కేసులో ఇలాగే విచారణకు పిలిచిన ఆప్ మంత్రులు, డిప్యూటీ సీఎం సిసోడియాలను అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అదే తరహాలో కేజ్రీవాల్ ను కూడా అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది. దీంతో కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. మరోసారి నోటీసులు పంపినా పట్టించుకోలేదు. ఈ నెల 3న విచారణకు హాజరు కావాలంటూ ఇటీవల ఈడీ నోటీసులు పంపించగా.. తమ అధినేతకు నోటీసులు పంపడం ఇల్లీగల్ అంటూ ఆప్ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు.