“పార్లమెంటులో ముస్లింపై మూకదాడులు జరిగే రోజు ఎంతో దూరంలో లేదు”: బిధూరి వ్యాఖ్యలపై ఒవైసీ

మీ సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ ఏమైపోయాయని నిలదీత

“Day not far when there will be mob lynching of a Muslim in Parliament”: AIMIM MP Owaisi on Bidhuri remarks

న్యూఢిల్లీః పార్లమెంటులో ముస్లింలపై మూకదాడి జరిగే రోజు ఎంతో దూరంలో లేదంటూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో ముస్లిం ఎంపీపై బిజెపి ఎంపీ రమేశ్ బిదూరీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘బిజెపి ఎంపీ పార్లమెంటులోనే ముస్లిం ఎంపీని దుర్భాషలాడడం చూశాం. పార్లమెంటులో ఆయన అలా చేసి ఉండాల్సింది కాదని ప్రజలంతా అంటున్నారు. అతడి నాలుక చాలా చెడ్డదని అంటున్నారు. ప్రజలు ఓటువేసి గెలిపించిన వారికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్లమెంటులో ముస్లింలపై మూకదాడి జరిగే రోజు ఎంతో దూరంలో లేదు’’ అని ఒవైసీ ఆవేదన వ్యక్తం చేవారు.

ఇంత జరిగినా ప్రధాని నరేంద్రమోడీ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదని, మీ ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ ఏమైపోయాయని ప్రశ్నించారు. చంద్రయాన్-3 మిషన్‌పై శుక్రవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా బీఎస్పీ నేత కున్వర్ డానిష్ అలీపై బిజెపి ఎంపీ రమేశ్ బిదూరీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి ఆయన వ్యాఖ్యలను తొలగించారు. రమేశ్ బిదూరీపై చర్యలు తీసుకోకుంటే తన లోక్‌సభ సభ్యత్వాన్ని వదులుకుంటానని డానిష్ అలీ స్పష్టం చేశారు. బిదూరీని సస్పెండ్ చేయడం సహా కఠిన చర్యలు తీసుకోవాలని విపక్ష పార్టీలు లోక్‌సభ స్పీకర్‌పై ఒత్తిడి తీసుకొచ్చాయి.