అంబేడ్క‌ర్ న‌గ‌ర్ రూపురేఖ‌లు పూర్తిగా మారిపోయాయి

అంబేద్కనగర్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ప్రారంభించిన కేటీఆర్‌

హైదరాబాద్: నగరంలోని అంబేద్కనగర్‌లో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇండ్లను మంత్రులు కేటీఆర్, మ‌హ‌ముద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ క‌లిసి శనివారం ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ సుర‌భి వాణీదేవి, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్ మోతె శ్రీల‌త రెడ్డితో పాటు ప‌లువురు కార్పొరేట‌ర్లు, అధికారులు పాల్గొన్నారు. నగర వాసుల కోసం ప్రభుత్వం రూ.28కోట్లతో 330 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను నిర్మించిన విషయం తెలిసిందే. ఒక్కో ఇంటిపై రూ. 8.50 లక్షలు ఖర్చు చేసి సకల సదుపాయాలతో కూడిన విలాసవంతమైన ఇండ్లను నిర్మించింది. ఈ మేరకు మంత్రి ఇండ్లను ప్రాంభించారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసి, ఇండ్ల తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. అంతకు ముందు డబుల్‌ ఇండ్ల ప్రారంభోత్సవానికి వచ్చిన కేటీఆర్‌కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. డప్పుచప్పులు, బోనాలతో ఆహ్వానించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అంబేడ్క‌ర్ న‌గ‌ర్ రూపురేఖ‌లు పూర్తిగా మారిపోయాయి. ఇంత అద్భుత‌మైన ఇండ్లు నిర్మించి ఇస్తార‌ని అనుకోలేద‌ని స్థానికులు చెబుతున్నారు. ఇదే స్థ‌లంలో ప్ర‌యివేటు అపార్ట్‌మెంట్‌ క‌ట్టి ఉంటే కోటిన్న‌ర అయి ఉండేద‌ని, కానీ ఒక్క పైసా తీసుకోకుండా సీఎం కేసీఆర్ ఇండ్లు నిర్మించి ఇచ్చారు అని ఆడ‌బిడ్డ‌లు చెబుతున్న మాట‌ల‌తో గుండె సంతోషంతో ఉప్పొంగిపోయింది అని కేటీఆర్ పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/