టీటీడీ చైర్మన్ పదవి రాజకీయ పునరావాసం కాకూడదుః పురందేశ్వరి

హిందూ ధర్మం అనుసరించే వాళ్లను నియమించాలని విజ్ఞప్తి

daggubati-purandeswari-on-ttd-chairman-post

తిరుమలః తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి రాజకీయ పునరావాసం కాకూడదని బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఈ మేరకు ఆమె సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ (ఎక్స్)లో ట్వీట్ చేశారు. హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవాళ్లే ఈ పదవికి న్యాయం చేయగలరన్నారు. ఇంతకుముందు ఈ ప్రభుత్వం 80 మంది సభ్యులతో ధర్మకర్తల మండలిని నియమించిందని, ఈ విషయంపై గళం విప్పిన తర్వాత 52 మంది నియామకం నిలిపి వేసినట్లు చెప్పారు. అంటే ప్రభుత్వం ఈ నియామకాలను రాజకీయ పునరావాస నియామకాలుగానే పరిగణిస్తోందని అర్థమవుతోందన్నారు.

కాబట్టి టీటీడీ చైర్మన్ పదవికి హిందూ ధర్మంపై నమ్మకం ఉన్న వారిని, హిందూధర్మం అనుసరించే వాళ్ళని నియమించాలన్నారు. కాగా, టీటీడీ చైర్మన్‌గా వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయన గతంలోనూ టీటీడీ చైర్మన్‌గా పని చేశారు.