ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు

మొన్నటి వరకు రాయలసీమ లో విస్తారంగా వర్షాలు పడిన సంగతి తెలిసిందే. ఇంకా పలుచోట్ల వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు అల్పపీడన తీవ్రత ఉత్తరాంధ్ర ఫై పడనుంది. దక్షిణ థాయిలాండ్‌ వద్ద అండమాన్ సమీపంలో నిన్న మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా ఏపీ, ఒడిశా తీరం వైపుగా దూసుకొస్తోంది. నిన్న సాయంత్రానికి నెల్లూరు తీరానికి 1,400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.

ఈ నెల 4 నాటికి తుపానుగా మారి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో ఎల్లుండి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పాటు గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఆ సమయంలో మత్స్యకారులు ఎవ్వరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. సైక్లోన్ అలర్ట్‌తో ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు గోదావరి జిల్లాల రైతుల్లో ఖండారు మొదలైంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర లో వరి కోత దశలో ఉంది. మొన్నటి వరకూ వర్షాలు కురుస్తుండటంతో కోతలు సాధ్యం కాలేదు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుట పడుతున్న సమయంలో మళ్లీ తుపాను హెచ్చరికలు రావడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.