పీవీ సింధుకు ఘనస్వాగతం

ఢిల్లీ మీదుగా హైదరాబాద్ చేరిక

హైదరాబాద్ : టోక్యో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో కాంస్యం సాధించిన తెలుగుతేజం పీవీ సింధు హైదరాబాద్ చేరుకుంది. ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. తెలంగాణ క్రీడల మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తదితరులు పీవీ సింధుకు, కోచ్ పార్క్ టే సంగ్ కు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలు కప్పి అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. సింధు సెమీస్ లో ఓటమిపాలైనా, ఆమె పోరాడిన తీరు ఆకట్టుకుందని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సింధు గొప్ప పేరు తీసుకువచ్చిందని తెలిపారు. హైదరాబాదులోనే బ్యాడ్మింటన్ ఓనమాలు దిద్దుకున్న సింధు ఇప్పుడు రెండడుగులు వెనక్కి వేసినా, వచ్చే ఒలింపిక్స్ లో రెండడుగులు ముందుకు వేస్తుందని అభిలషించారు.

సీఎం కేసీఆర్ కూడా సింధును ఎంతో ప్రోత్సహిస్తున్నారని వెల్లడించారు. సింధు వచ్చే ఒలింపిక్స్ లో తప్పకుండా స్వర్ణం సాధించాలని ఆకాంక్షించారు. తద్వారా మరెంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రత్యేక క్రీడా విధానం తీసుకువస్తున్నామని, భవిష్యత్తులో తెలంగాణ ఓ క్రీడా హబ్ గా మారనుందని అన్నారు.

ఇక పీవీ సింధు మాట్లాడుతూ.. తనకు తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి ఎంతో సహకారం అందించిందని వెల్లడించింది. తాను ఎక్కడ ప్రాక్టీసు చేసుకుంటానన్నా వెంటనే అనుమతులు మంజూరు చేశారని తెలిపింది. మీడియా మద్దతు కూడా మరువలేనిదని పేర్కొంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/