మండూస్‌ కారణంగా తమిళనాట నలుగురు బలి

మండూస్‌ కారణంగా తమిళనాడు లో ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు సీఎం స్టాలిన్ తెలిపారు. రాత్రి 1:30 గంటలకు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తుఫాన్ తీరం దాటింది. సాయంత్రం తీవ్ర వాయుగుండం బలహీనపడి, పశ్చిమ వాయువ్య దిశగా ప్రస్తుతం చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది. మాండస్ తుఫాన్ కారణంగా తమిళనాడు తో పాటు ఏపీలోని పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తెలంగాణాలో అక్కడక్కడా చిరుజల్లులు పడుతున్నాయి.

తమిళనాట ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. తుఫానువల్ల భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇప్పటికే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా 98 పశువులు మృతిచెందాయి. మరోవైపు 181 నివాసాలు దెబ్బతిన్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఈ వివరాలను మీడియాకు తెలియజేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఆయన ఇవాళ పరిశీలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్న తీరును అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు.

తుఫాను ప్రభావంతో తమిళనాడు రాజధాని చెన్నైతోపాటు సముద్ర తీర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దాంతో పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచి తటాకాలను తలపిస్తున్నాయి.