తెలంగాణ పీసీసీ కమిటీని ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం

తెలంగాణ పీసీసీ కమిటీని ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. కమిటీల్లో పలు మార్పులు, చేర్పులు చేసింది. అలాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీని 18మందితో ఏర్పాటు చేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నలుగురిని నియమించింది. 26 జిల్లాల అధ్యక్షులతో పాటు.. 24 మంది టీపీసీసీ వైస్‌ ప్రెసిడెంట్లను, 84 మంది జనరల్‌ సెక్రటరీలను నియమించింది.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చైర్మన్ గా 40 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రకటించింది. తెలంగాణకు నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించింది. అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, అజహరుద్దీన్, మహేశ్ గౌడ్ లను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. మాణికం ఠాగూర్ చైర్మన్ గా 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని నియమించింది. ఈ కమిటీలో రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీహెచ్, శ్రీధర్ బాబు, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, రేణుకాచౌదరి, మధుయాష్కీ గౌడ్, చిన్నారెడ్డి, బలరాం నాయక్, జానా రెడ్డి, వంశీచంద్ రెడ్డి, టి. జీవన్ రెడ్డి, సంపత్ కుమార్, షబ్బీర్ అలీ సభ్యులుగా ఉన్నారు.

24 మంది నూతన వైస్ ప్రెసిడెంట్లను, 59 మంది ప్రధాన కార్యదర్శులను, 26 జిల్లాలకు నూతన డీసీసీ ప్రెసిడెంట్లను కూడా కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. అయితే ఏ కమిటీలోనూ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అవకాశం కల్పించలేదు. గత కొద్దిరోజులుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పాటు.. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించారని, బీజేపీ నేత, తన సోదరుడు రాజగోపాల్‌ రెడ్డికి సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనిపై కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం షోకాజు నోటీసులు జారీచేసింది. దానికి ఆయన వివరణ కూడా ఇచ్చారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఈ కమిటీల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అవకాశం కల్పించలేదు.