పుల్వామాలో తుపాకీతో కాల్చుకున్న సీఆర్పీఎఫ్ జవాన్

కొంతకాలంగా డిప్రెషన్ తో బాధపడుతున్నాడని అధికారుల వివరణ

CRPF Jawan Shoots Himself Dead In Jammu and Kashmir’s Pulwama district

శ్రీనగర్‌ః జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో ఓ జవాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విధినిర్వహణలో శుక్రవారం అర్ధరాత్రి తనను తాను కాల్చుకున్నాడు. ప్రాథమిక విచారణలో డిప్రెషన్ వల్లే జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తేలిందని సీఆర్ పీఎఫ్ అధికారులు చెప్పారు.

సీఆర్ పీఎఫ్ జవాన్ అజయ్ కుమార్ దక్షిణ కశ్మీర్ జిల్లా అవంతిపొరలోని సెయిల్ ఏరియాలోని చెక్ పోస్ట్ లో విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా అజయ్ డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఎప్పటిలాగే శుక్రవారం విధులు నిర్వహిస్తున్న అజయ్.. అర్ధరాత్రి తర్వాత సుమారు 1:55 గంటల ప్రాంతంలో తుపాకీతో తనను తాను కాల్చుకున్నాడు.

కాల్పుల శబ్దం విని అక్కడికి చేరుకున్న మిగతా జవాన్లకు రక్తపుమడుగులో పడి ఉన్న అజయ్ కనిపించాడని అధికారులు తెలిపారు. డిప్రెషన్ వల్లే అజయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. అజయ్ మృతిపై విచారణ జరిపిస్తామని సీఆర్ పీఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు.