పవన్ కళ్యాణ్ ఫై క్రిమినల్ కేసు నమోదు..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేసింది. గతేడాది జులై 9న పవన్ వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలతో కేసు పెట్టింది. దీంతో 499, 500, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన జిల్లా కోర్టు.. కేసును నాలుగో అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. ఈనెల 25న విచారణకు రావాలని పవన్ కు జడ్జి నోటీసులిచ్చారు. వాలంటీర్లు ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి వస్తున్నారనీ, ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారని అన్నారు. అంతేకాదు.. వాలంటీర్ల వల్ల ఇళ్లలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోందనీ, కొంతమంది వాలంటీర్లు బ్లాక్‌మెయిల్స్‌కి పాల్పడుతున్నారంటూ.. చాలా వ్యాఖ్యలు చేశారు. దీనిపై అప్పట్లోనే అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. తాజాగా కోర్టు విచారణకు పిలవడంతో.. ఏం జరుగుతుందో అనే టెన్షన్ జనసేన కార్యకర్తలు, అభిమానుల్లో ఉంది.

ఇదిలా ఉంటె ఈరోజు పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో అక్కడకు చేరుకోనున్న ఆయన.. విశాఖ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమావేశం కానున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు, ఎన్నికల కోసం కేడర్ను సన్నద్ధం చేసే అంశాలపై పవన్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.