కరోనా ఇంకా ముగియలేదు..మరో వేవ్‌ రావొచ్చు : డబ్ల్యూహెచ్‌ చీఫ్‌

WHO chief scientist Soumya Swaminathan

జెనీవా: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. కరోనా రకరకాల వేరియంట్లతో విబృంభిస్తూ ప్రాణాలు తీసింది. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాల్లో కరోనా వేరియంట్ ఓమిక్రాన్ నుంచి సబ్ వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్ ఇలా వరస వేరియంట్లు కరోనా వేవ్‌లకు కారణం అవుతున్నాయి. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఓమిక్రాన్ సబ్ వేరియంట్లు ప్రపంచవ్యాప్తంగా మరో కోవిడ్-19 వేవ్ కు కారణం అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్‌ XXB సబ్‌వేరియంట్‌ వ్యాపిస్తోందని, దీని వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ హెచ్చరించారు. ఈ సందర్భంగరా ఆమె మాట్లాడుతూ..

తాము ఏబీ5, ఏబీ1 వేరియంట్లను గుర్తించామని, వీటి ద్వారా వ్యాధి వేగంగా వ్యాపించడంతో పాటు రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. గత కొన్ని నెలలుగా ప్రపంచ వ్యాప్యతంగా అనేక దేశాల్లో కరోనా పరీక్షలు తగ్గుముఖం పట్టాయని, ప్రపంచ వ్యాప్తంగా ప్రతీవారం 8000 నుంచి 9000 కరోనా కేసులు నమోదు అవుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదని, నివారణ చర్యలు ఇంకా కొనసాగించాలని సూచించారు. కరోనా తగ్గిపోయింది కదా అని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ల ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. అలాగే మాస్క్‌లు ధరించడం తప్పనిసరి అని సూచించారు.

ఈసారి కోవిడ్‌ రోగులు ఆస్పత్రిలో, ఐసీయూలో చేరే అవకాశం తక్కువగా ఉందన్నారు. తేలికపాటి ఇన్ఫెక్షన్, జలుబు, దగ్గు, శరీర నొప్పి ఉంటుంది. రోగులు 3-4 రోజుల్లో కోలుకోవచ్చు. ఇంతలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కూడా కోవిడ్ -19 గ్లోబల్ ఎమర్జెన్సీగా ఉందని బుధవారం తెలిపింది. ఈ వైరస్ ఇంకా వ్యాప్తి చెందుతోంది. దీని నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలి. కరోనా మహమ్మారి ముగిసిందని ప్రజలు భావిస్తున్నారని, అయితే అది అలా కాదని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. వైరస్‌ కొత్త కొత్త వేరియంట్లతో వ్యాప్తి కొనసాగుతోందన్నారు.