చంద్రబాబు కేసులపై ఏ తీర్పు వస్తుందో..?

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టు అయిన టీడీపీ అధినేత చంద్రబాబు కేసులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అటు సుప్రీంకోర్టు, ఇటు హైకోర్టు, మరోపక్క ఏసీబీ కోర్టుల్లో తీర్పులు వెలువడే అవకాశాలున్నాయి. దీంతో చంద్రబాబుకు జైలు నుంచి విముక్తి లభిస్తుందా..? అనే ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు దాఖలుచేసిన ఎస్‌ఎల్‌పీ సుప్రీంకోర్టు ముందు సోమవారం విచారణకు రానుంది.

జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది. ఈ నెల 3న దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం… హైకోర్టు ముందు దాఖలుచేసిన పత్రాలను తమకు సమర్పించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను 9వ తేదీకి వాయిదా వేసింది. అందుకు అనుగుణంగా సోమవారం ఈ కేసు 59వ ఐటం కింద విచారణకు రానుంది. గతంలో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు హరీష్‌సాల్వే, అభిషేక్‌ మను సింఘ్వీ, సిద్ధార్థలూథ్రా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముకుల్‌ రోహత్గీ, రంజిత్‌కుమార్‌ వాదనలు వినిపించారు.

అలాగే ఏసీబీ కోర్టులో బెయిల్, సీఐడీ కస్టడీ పిటీషన్లపై వాదనలు ముగిసినా తీర్పు రిజర్వులోనే ఉంది. అలాగే హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై తీర్పు వెలువడనుంది. దీంతో చంద్రబాబు కేసులపై తీర్పు విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.