కోహినూర్‌లేని కిరీటంతోనే పట్టాభిషేకానికి బ్రిటన్ రాణి కెమిల్లా !

Controversial crown will not be worn during King Charles III’s coronation ceremony

లండన్‌ః మరో మూడు నెలల్లో బ్రిటన్ రాజు చార్లెస్‌-3 పట్టాభిషేకం జరగనున్న నేపథ్యంలో రాజవంశం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టాభిషేకంలో కోహినూర్ వజ్రాన్ని వినియోగించకూడదని నిర్ణయించింది. వలస రాజ్యాల పాలనకు గుర్తుగా బ్రిటన్‌ రాచకుటుంబం చేతిలో ఉన్న వివాదాస్పద కోహినూర్‌ వజ్రం లేని కిరీటంతోనే తన భర్త, కింగ్‌ ఛార్లెస్‌-3 పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనాలని బ్రిటన్‌ రాణి కెమిల్లా నిర్ణయించారు. ఈ విషయాన్ని బకింగ్‌హాం ప్యాలెస్‌ వర్గాలు వెల్లడించాయి. క్వీన్ కాన్సార్ట్ అయిన కెమిల్లా కిరీట ధారణ కార్యక్రమంలో ఈ వజ్రాన్ని వినియోగించాలని తొలుత భావించినా.. చివరకు ఆ ఆలోచనను పక్కన పెట్టారు.

ఈ కిరీటానికి బదులు.. క్వీన్‌ మేరీ ధరించిన మరో కిరీటాన్ని కెమిల్లా ధరించనున్నారు. ఇప్పటికే కెమిల్లాకు అనుకూలంగా ఉండేందుకు ఈ కిరీటం పరిమాణంలో మార్పులు చేస్తున్నారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్‌-2కు చెందిన నగలను ఈ కిరీటంలో పొదగనున్నారు. కాగా, ఈ ఏడాది మే 6న బ్రిటన్ రాజు చార్లెస్‌ పట్టాభిషేకం జరుగుతుంది. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో పట్టాభిషేక కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఆదే సమయంలో క్వీన్ కాన్సార్ట్ కెమిల్లా కిరీట ధారణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు.

ఏడు దశాబ్దాలపాటు బ్రిటన్‌ను పాలించిన క్వీన్‌ ఎలిజబెత్‌-2 కిరీటంలో కోహినూర్‌ వజ్రాలంకరణ ఆమె మరణించేదాకా కొనసాగింది. దౌత్యపరంగా సున్నితమైన అంశాల కారణంగానే రాణి కెమిల్లా కోహినూర్‌కు దూరంగా ఉండాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్ రాజు పట్టాభిషేకంలో కోహినూర్ వజ్రాన్ని వినియోగిస్తే భారత్‌తో దౌత్య పరమైన సమస్యలు తలెత్తొచ్చని బ్రిటన్‌లో ఇప్పటికే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కోహినూర్‌ను తిరిగిచ్చేయాలని భారత్ ప్రభుత్వం పలుమార్లు బ్రిటన్‌ను కోరిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో రాజకుటుంబం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.