భువనగిరి సమీపంలో స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారి నూతన దేవాలయ నిర్మాణం

Swarnagiri Sri Venkateswara Swamy’s new temple

శ్రీమతే రామానుజాయ నమ: యాదాద్రి తిరుమల దేవస్థానము, మానేపల్లి హిల్స్, యాదాద్రిభువనగిరి జిల్లా, తెలంగాణ.అఖిలభువన జన్మస్తేమ భంగాది లీలుడని భగవద్ రామానుజులచే కీర్తింపబడిన అఖిలాండ కోటీ బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి నూతన దేవాలయం మన తెలంగాణా, యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి సమీపంలో నిర్మింపబడినది. పరమహంస పరివ్రాజకులు, ఉభయవేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనములతో, ప్రముఖ వ్యాపార వేత్త శ్రీమాన్ మానేపల్లి రామారావు, వారి ధర్మపత్ని శ్రీమతి విజయ లక్ష్మీ పుణ్య దంపతుల దివ్య సంకల్పానుసారము గా వారి కుమారులు శ్రీమాన్ మానేపల్లి మురళీకృష్ణ, శ్రీమాన్ మానేపల్లి గోపీకృష్ణ గారల నేతృత్వం లో అత్యంత సుందరంగా ఈ ఆలయం నిర్మింపబడినది.

మానేపల్లి కుటుంబం వారి స్వంత భూమి సుమారు 22 ఎకరాల ప్రాంగణం లోని “స్వర్ణగిరి” అని నామకరణం గావించబడిన కొండ మీద శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ, తెన్నాచార్య సంప్రదాయమును అనుసరిస్తూ, ప్రాచీన శిల్ప శాస్త్ర రీతులను అవలంబిస్తూ సువిశాలముగా “యాదాద్రి తిరుమల దేవస్థానం” పేరుతో రూపుదిద్దుకున్నది. పల్లవ, విజయ నగర, చోళ , చాళుక్య శిల్ప రీతులతో, ప్రాకారానికి నాలుగు వైపులా నాలుగు రాజగోపురాలతో, సువిశాలమైన మండపాలతో, 5 అంతస్తుల విమాన గోపురం తో కూడిన గర్భాలయంలో, సుమారు 12 అడుగుల ఎత్తైన బృహత్ విగ్రహ రూపంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారు కొలువైన ఈ క్షేత్రమ్ తెలంగాణలోని అతిపెద్ద శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం గా చెప్పుకోవచ్చు. శ్రీవారితో పాటుగా శ్రీ పద్మావతి దేవి, శ్రీ గోదా దేవి, శ్రీ మదన గోపాల కృష్ణ స్వామి, శ్రీ గరుడాల్వార్, శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు నిర్మింపబడ్డాయి. దేవాలయ ఆవరణలో మనోభీష్ట ఫలకం ప్రత్యేక ఆకర్షణ, భక్తుల విన్నపాలు దీని ద్వార స్వామివారికి అనుసందాన మవుతాయి. బ్రహ్మోత్సవాల కనుగుణంగా విశాలమయిన మాడ వీదులతో మరియు రథశాలతో పాటు 40 అడుగుల ఎత్తైన ఛూడ చక్కటి రథము రూపు దిద్దుకున్నది. సుమారు 27 అడుగుల ఏకశిలా ఆంజనేయ స్వామి వారి దివ్య మూర్తి, శ్రీ లక్ష్మి నారసింహ స్వామి, శ్రీ భూ వరాహ స్వామి, వకులమాత, హంపి శిల్పరీతులతో నిర్మితమైన విశాలమైన పుష్కరిణి, అందులో నాలుగు వేదాలకు ప్రతీకలైన వేదమూర్తుల విగ్రహాలు, మధ్యలో పెద్ద జలనారాయణ మూర్తి ప్రతిష్టింప బడుతున్నాయి. ప్రత్యేక ఆకర్షణగా సుమారు ఒకట్టిన్నర టన్నుల భారి కంచు గంట భక్తుల ప్రార్దన శ్రీవారికి చేరేందుకు భక్తులు మ్రోగించుటకై విజయ గంటను జయ గంటా మండపములో నెలకొల్ప బడింది. దివ్యక్షేత్రంలో

అడుగిడగానే శ్రీవారి పాదస్పర్శ దివ్యానుభూతి పొందుటకై శ్రీవారి పాధుకలను ఏకకృష్ణ శిలతో మొదటి మెట్టుకన్నాముందే శ్రీవారి పాద పీఠం ఏర్పాటు చేయనైనది. సమతామూర్తి శ్రీ రామానుజాచార్య, 108 దివ్యదేశ ఆలయాల రూపశిల్పి, ప్రముఖ స్థపతి శ్రీమాన్ DNV ప్రసాద్ స్థపతి ఈ ఆలయ రూపకల్పన చేయడమే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి అనేక మంది శిల్పులను సమీకరించి ఆలయ నిర్మాణాన్ని ఆద్యంతమూ పర్యవేక్షించారు.ఈ ఆలయం ప్రాణప్రతిష్ట మహా కుంభాభిషేక మహోత్సవాలు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో, వారి కరకమలముల మీదుగా, 2024 మార్చ్ 1 వ తేదీనుండి 6 వ తేది వరకు జరుగనున్నాయి. 6 వ తేదీ ఉదయం గం 11-06 నిమిషములకు ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమము జరుగును. తదుపరి శ్రీవారి శాంతికల్యాణము తో కార్యక్రమాలు సుసంపన్నము కానున్నాయి. కావున భక్తులు అందరూ విచ్చేసి, కార్యక్రమం లో పాల్గొని శ్రీవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి శ్రీ వారి కృపకు పాత్రులు కా గలరని భక్తిపూర్వకం గా ఆహ్వానిస్తున్నాము.

భవదీయులు,
మానేపల్లి కుటుంబము.
మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్.