పార్లమెంట్‌ వేదికగా వైట్‌ పేపర్‌..బ్లాక్‌ పేపర్‌ వార్‌..!

Congress To Present ‘Black Pepper’ On Modi Government In Parliament Today

న్యూఢిల్లీః పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో వైట్‌, బ్లాక్‌ పేపర్ల వార్‌ మొదలైంది. దేశ ఆర్థిక స్థితిగతులపై అధికార, విపక్ష పార్టీలు నేడు పార్లమెంట్‌లో వైట్‌, బ్లాక్‌ పేపర్లను సమర్పించేందుకు సిద్ధమయ్యాయి. తన పదేళ్ల పాలనపై కేంద్రంలోని అధికార బిజెపి గురువారం పార్లమెంట్‌లో ‘వైట్‌పేపర్‌’ ను ప్రవేశపెట్టబోతోంది. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాధించిన విజయాలను జాబితా చేస్తూ శ్వేతపత్రం విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 1న తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ శ్వేతపత్రాన్ని సమర్పిస్తామని ప్రకటించారు. 2014 ముందు వరకు, ఆ తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి మధ్య తేడాను వెల్లడించే ఉద్దేశంతో దీనిని పార్లమెంట్‌ ఉభయసభల ముందు ఉంచుతామన్నారు. దాని ద్వారా గత పాలనలో లోపాలను ఎత్తిచూపడమే తమ లక్ష్యమని చెప్పారు.

బిజెపికి పోటీగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ కూడా బరిలోకి దిగింది. గత పదేళ్ల మోడీ ప్రభుత్వ పనితీరుపై శ్వేతపత్రాన్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ ‘బ్లాక్‌ పేపర్‌’ప్రవేశ పెట్టబోతోంది. కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ఈ బ్లాక్‌ పేపర్‌ను సభ ముందుకు తీసుకెళ్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పదేళ్ల నరేంద్ర మోడీ పాలన వైఫల్యాలను ఎత్తిచూపే ఉద్దేశంతోనే బ్లాక్‌పేపర్‌ను పార్లమెంట్‌ ఉభయ సభల ముందు ఉంచనున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. బిజెపి హయాంలో పెరిగిన ధరలు, నిరుద్యోగం తదితర అంశాలను బ్లాక్ పేపర్‌ లో వివరించనున్నట్లు పేర్కొన్నాయి.