సీఎం జగన్‌తో సమావేశమైన టీమిండియా యువ క్రికెటర్

తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో కలిసిన కేఎస్ భరత్

Indian Cricketer KS Bharat Meets CM YS Jagan in Tadepalle

అమరావతిః టీమిండియా యువ క్రికెటర్ కె. శ్రీకర్ భరత్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ తరఫున వికెట్ కీపర్‌గా ఆడిన భరత్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రితో మర్యాదపూరకంగా సమావేశం అయ్యాడు. ఈ సందర్భంగా భారత జట్టులోని ఆటగాళ్లు సంతకాలు చేసిన తన టెస్టు జెర్సీని సీఎంకు భరత్ బహూకరించాడు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు భరత్‌ను జగన్ అభినందించారు.

భవిష్యత్‌లో జట్టుకు ఎన్నో విజయాలను సాధించి పెట్టాలని ఆకాంక్షించారు. అనంతరం భరత్ మాట్లాడుతూ వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఏపీ నుంచి భారత జట్టులో అవకాశం పొందిన తొలి ఆటగాడు తానేననని చెప్పాడు. అందుకు తాను గర్వపడుతున్నానని అన్నాడు. జగన్ పాలనలో క్రీడల అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులు, స్పోర్ట్స్ ప్రమోషన్ బాగుందని కొనియాడాడు. కాగా, ఈ మధ్యే మరో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు.. చెన్నై సూపర్ కింగ్స్ యజమానితో కలిసి జగన్ తో సమావేశమైన సంగతి తెలిసిందే.