ప్రధాని మోడీ కి సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తి

‘కరెన్సీ నోట్లపై లక్ష్మీ-గణేశుడి ఫొటో పెట్టండి’

Kejriwal’s appeal to PM Modi: ‘Put Lakshmi-Ganesha photo on currency notes’

న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కరెన్సీ నోట్లపై గణేశుడు, లక్ష్మీదేవి ఫొటోలను పెట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. మన ఆర్థిక వ్యవస్థను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి ఇది చాలా అవసరమన్న ఆయన.. దాంతో పాటు మన దేవతల ఆశీస్సులు కూడా అవసరమని చెప్పారు. ఈ క్రమంలోనే మన కరెన్సీ నోట్లపై లక్ష్మీజీ , గణేష్‌జీ ఫోటో ఉంటే మన దేశం అభివృద్ధి చెందుతుందని కేజ్రీవాల్ అన్నారు. ఇప్పటికే ఉన్న కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీ ఫొటోను అలాగే ఉంచాలని చెప్పారు. ఆ చిత్రం పక్కన లక్ష్మీజీ, గణేషాజీల ఫొటోలను ముద్రించవచ్చని ఢిల్లీ సీఎం తెలిపారు.

ఇండోనేషియా ఒక ముస్లిం దేశమని,అక్కడి జనాభాలో హిందువులు కేవలం 2 శాతం కంటే తక్కువ ఉన్నారని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. అలాంటి దేశంలో సైతం కరెన్సీపై గణేశుడిని ముద్రించారని చెప్పారు. అదే తరహాలో భారత్ లోనూ వారి చిత్రాలను మనమెందుకు పెట్టుకోవద్దు అని ప్రశ్నించారు. అలా చేస్తే మన దేశం ఇంకా బాగుపడుతుందని చెప్పారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో ప్రధానమంత్రికి లేఖ రాస్తానన్న కేజ్రీవాల్.. కొత్తగా ముద్రించే నోట్లపై ఈ బొమ్మలు ఉండాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు