ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం‌ – హరీష్

బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం ఫై నిప్పులు చెరిగారు. ప్రజా పాలనను గాలికొదిలేసి.. ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం, ఎంతసేపు మా పార్టీలోకి నువ్వు వస్తావా రాకపోతే నీ మీద కేసులు పెడతా, పార్టీలో చేరాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ రకరకాల ఒత్తిళ్లకు గురిచేస్తుంద‌న్నారు. పార్టీలో చేరకపోతే అక్రమ కేసులు బనాయించే విధంగా కొనసాగుతుంద‌ని తెలిపారు. ఖమ్మం లాంటి పట్టణాల్లో 3, 4 రోజులకోసారి తాగునీరు వస్తుందన్నారు. కాంగ్రెస్ 100 రోజుల్లో హామీలు అమలుపర్చుతామని ఘోరంగా విఫలమైంద‌ని ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌ నాయకులను టార్గెట్‌ చేస్తూ ఇదంతా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదన్న విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. విపక్ష నేతలను ఏదోరకంగా జైలుకు పంపాలని చూస్తున్నారని వెల్లడించారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఇవ్వకుండా పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడిని ఎలా అరెస్ట్‌ చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే మూడు కేసులు పెట్టారని.. వాటిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్‌ పార్టీకి శిక్షవేస్తామని హెచ్చరించారు.