ఓ చెడు శకునం స్టేడియంలో మ్యాచ్ చూడ్డం వల్లే భారత్ ఓడిందన్న రాహుల్‌గాంధీ

రాహుల్ మతి స్థిమితం కోల్పోయారన్న బిజెపి

Rahul Gandhi

న్యూఢిల్లీః ప్రపంచకప్ ఫైనల్‌లో భారత జట్టు ఓటమిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైంది. మ్యాచ్‌ను వీక్షించేందుకు మోడీ స్టేడియానికి రావడం వల్లే జట్టు ఓటమి పాలైందని విమర్శించారు. ఇండియా దాదాపు ప్రపంచకప్‌ను గెలుచుకుందని, కాకపోతే ఓ చెడు శకనం వారిని ఓడిపోయేలా చేసిందని మోడీని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీవీల్లో ఈ విషయం చూపించరని, కానీ దేశ ప్రజలకు అది తెలుసని అన్నారు.

రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాలోర్‌లో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. మన జట్టు గెలిచేదేనని, అయితే ఓ చెడు శకనం మ్యాచ్‌కు రావడం వల్ల మనోళ్లు ఓడిపోయారని వ్యాాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలపై బిజెపి అంతే స్థాయిలో స్పందించింది. ఆయన వ్యాఖ్యలు సిగ్గుచేటని, అవమానకరమని, ఖండించదగినవని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ మానసిక అస్థిరతకు ఆయన మాటలు అద్దంపడుతున్నాయని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమర్శించారు.