పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్ల తీరు భిన్నంగా ఉండొచ్చుః శశిథరూర్

Shashi Tharoor
Shashi Tharoor

న్యూఢిల్లీః కర్ణాటక ఎన్నికల్లో విజయం తరువాత కాంగ్రెస్‌ పార్టీ అలసత్వాన్ని దరిచేరనీయకూడదని పార్టీ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ తాజాగా హెచ్చరించారు. రాష్ట్ర ఎన్నికల్లో కంటే జాతీయ ఎన్నికల్లో ఓటర్ల తీరు భిన్నంగా ఉండొచ్చని వ్యాఖ్యానించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘఢ్ ఎన్నికల్లో విజయాల తరువాత కాంగ్రెస్ 2019 నాటి పార్లమెంటరీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించని విషయాన్ని గుర్తు చేశారు.

రాష్ట్ర స్థాయిలో వర్కౌట్ అయిన వ్యూహం జాతీయ స్థాయిలోనూ పనిచేస్తుందని భావించకూడదని సూచించారు. కర్ణాటకలో ధృఢమైన, ప్రభావశీలమైన నాయకత్వం కాంగ్రెస్ విజయానికి దోహదపడిందని శశిథరూర్ అభిప్రాయపడ్డారు. హిజాబ్, టిప్పు సుల్తాన్ వంటి అంశాలకున్న ఓట్లు రాల్చే శక్తికి ఓ కాలపరిమితి ఉంటుందని కూడా చెప్పారు. ఇటీవల ఓ సాహిత్య కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ శశిథరూర్ తన తాజా పుస్తకం ‘ది ఇంగ్లోరియస్ ఎంపైర్‌’పై ప్రసంగించారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ ఈ హెచ్చరికలు చేశారు.