నేడు ఎమ్మెల్సీ నామినేషన్ వేయనున్న కాంగ్రెస్ అభ్యర్థులు

Congress candidates who will file MLC nomination today

హైదరాబాద్‌ః కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇద్దరు ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసిన మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్లు తమ నామపత్రాలను ఈరోజు రిటర్నింగ్ అధికారికి అందజేస్తారు. నామినేషన్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అధికార పార్టీ నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే చివరి క్షణంవరకు అద్దంకి దయాకర్, మహేష్ కుమార్ గౌడ్ల మధ్య నెలకొన్న పోటీ తీవ్ర ఉత్కంఠతకు దారి తీసింది.

దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్కు బదులు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారు. వీరు పోటీ చేయనున్న ఎమ్మెల్సీల గడువు 2027 నవంబర్ 30వ తేదీ వరకు ఉంది. ఈ రెండు కూడా ఉపఎన్నికలు కావడంతో శాసనసభలో అత్యధిక స్థానాలు కలిగిన కాంగ్రెస్ పార్టీకి రెండు ఎమ్మెల్సీలు దక్కనున్నాయి.

మరోవైపు ఎమ్మెల్సీఎన్నికలకు ఈ నెల 11న నోటిఫికేషన్‌ జారీకాగా అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. నామినేషన్ల స్వీకరణకు ఇవాళ్టితో గడువు ముగియనుంది. ఈ నెల 19న నామపత్రాల పరిశీలన, 22 వరకు ఉపసంహరణ ప్రక్రియ 29న ఎన్నికలు జరగనున్నాయి. 29 సాయంత్రమే ఫలితాలు వెల్లడికానున్నాయి.