నా పై కుట్ర జరుగుతోందిః బ్రిజ్ భూషణ్ సింగ్

నిజం బయటకొస్తే ప్రియాంక గాంధీ పశ్చాత్తాపం చెందుతారని వ్యాఖ్య

Congress, Bajrang Punia conspiring against me, have proof: WFI chief on wrestlers’ protest

న్యూఢిల్లీః మహిళా రెజర్ల లైంగిక వేధింపుల ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. తనపై కుట్ర జరుగుతోందని, దీని వెనక రెజ్లర్ బజరంగ్ పూనియా ఉన్నాడని ఆరోపించారు. ఇందుకు సంబంధించి తన వద్ద ఆడియో సాక్ష్యం తన వద్ద ఉందన్నారు. నిజం బయటకొచ్చాక రెజ్లర్లకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పశ్చాత్తాపం చెందక తప్పరని పేర్కొన్నారు. రెజర్ల ఆరోపణలు, నిరసనల వెనక కాంగ్రెస్ నేత దీపేందర్ హుడా, రెజ్లర్ బజరంగ్ పూనియా ఉన్నారన్న బ్రిజ్ భూషణ్.. దీనిని నిరూపించే ఆడియా ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. వీటిని తాను ఢిల్లీ పోలీసులకు అందజేస్తానని తెలిపారు. బ్రిజ్‌భూషణ్‌ను అరెస్ట్ చేసే వరకు తమ నిరసన కొనసాగుతుందని రెజర్లు హెచ్చరించిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

కైసర్‌గంజ్ ఎంపీ కూడా అయిన బ్రిజ్‌భూషణ్ మాట్లాడుతూ.. దర్యాప్తుకు తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. తనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్‌లకు సంబంధించిన కాపీలు ఇంకా తనకు అందలేదన్నారు. నిరసనకారులు ఇంటికెళ్లి ప్రశాంతంగా నిద్రపోతే అప్పుడు రాజీనామా చేసేందుకు తాను సిద్ధమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తమ ‘మన్ కీ బాత్’ కూడా వినాలని నిరసన చేస్తున్న రెజర్లు కోరారు. జంతర్‌ మంతర్ వద్ద నిరసనకు దిగిన రెజర్లు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగుతుందని టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పూనియా స్పష్టం చేశాడు.