కర్ణాటక అసెంబ్లీ ఎన్నిక..కాంగ్రెస్ తుది జాబితా

Congress party
Congress party

బెంగళూరు: నేటితో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లను గడువు ముగియనున్నది. దీంతో కాంగ్రెస్‌ ఐదుగురు అభ్యర్థులతో కూడిన చివరిదైన ఆరో జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే ఐదు దఫాల్లో 219 మంది అభ్యర్థులను ప్రకటించిన గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ.. గురువారం తెల్లవారుజామున మిగిలిన ఐదుగురు అభ్యర్థులతో తుది జాబితను వెల్లడించింది. తాజాగా ప్రకటించిన లిస్ట్‌లో సిద్లఘట్టా సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన వీ మునియప్పకు మరోసారి టికెట్‌ నిరాకరించింది. ఆయన స్థానంలో బీవీ రాజీవ్‌ గౌడను అభ్యర్థిగా ప్రకటించింది. ఇక మిగిలిన నాలుగు స్థానాల్లో మహమ్మద్‌ షాలమ్‌ (రాయ్‌చూర్‌), ఎస్‌ ఆనంద్‌ కుమార్‌ (సీవీ రామన్‌ నగర్‌), హెచ్‌పీ సిద్ధర్‌ గౌడ (అర్కాల్‌గుడ్‌), ఇనాయత్‌ అలీ (మంగళూర్‌ సిటీ నార్త్‌)కు సీట్లు కేటాయించింది.

బుధవారం రాత్రి ప్రకటించిన ఐదో జాబితాలో.. షిగ్గౌన్‌ నుంచి సీఎం బస్వారాజ్‌ బొమ్మై పై పోటీలో నిలిపిన అభ్యర్థిని మార్చింది. మొదట మహమ్మద్‌ యూసుఫ్‌ సవనూర్‌ను తన అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ.. ఆయన స్థానంలో యాసిర్‌ అహ్మద్‌ ఖాన్‌ పఠాన్‌ను బొమ్మైపై పోటీకి నిలిపింది. ఇక గత ఎన్నికల్లో పులకేశీనగర్‌ నుంచి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఆర్‌ అఖండ శ్రీనివాస్‌ మూర్తికి మరోసారి టికెట్‌ నిరాకరించింది. ఆయన స్థానంలో ఏసీ శ్రీనివాసను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో మొత్తం 224 స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలిపినట్లయింది. వచ్చే నెల 10న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల 12న ఫలితాలు వెలువడుతాయి.