కరోనా ఆనవాళ్ల గురించి తెలిసింది చెప్పండి: డబ్ల్యూహెచ్ వో

డబ్ల్యూహెచ్ వో, శాస్త్రవేత్తలతో పంచుకోవడం ఎంతో అవసరమని ప్రకటన

Come clean on Covid origins, says WHO is lab leak theory gains momentum

జెనీవాః కరోనా మహమ్మారి ఈ వైరస్‌ ప్రపంచాన్ని వణికించిన విషయం తెలిసిందే. ఇది మొదట చైనాలోనే పుట్టిందనే విషయంలో ఎవరికీ సందేహం లేదు. కానీ, చైనాలో సహజంగానే ఈ మహమ్మారి ఉద్భవించిందా..? లేక అమెరికా చెబుతున్నట్టు అది చైనాలోని వుహాన్ ల్యాబ్ లో తయారు చేసిన వైరస్సా? అనే విషయమై నిర్ధారణ లేదు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ పుట్టుక మూలం గురించి ప్రపంచ దేశాలు తమకు తెలిసిన సమాచారాన్ని తనతో పంచుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) పిలుపునివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

‘‘కరోనా మహమ్మారి మూలం గురించి సమాచారం ఉంటే దాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ, శాస్త్రవేత్తలతో పంచుకోవడం ఎంతో అవసరం. ఇది ఎవరో ఒకరిని నిందించేందుకు కాదు. మహమ్మారి ఎలా మొదలైందో తెలుసుకుని, అవగాహన పెంచుకోవడం కోసం. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, నివారించేందుకు వీలుంటుంది’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదనామ్ గెబ్రేయెసెస్ అన్నారు.

ఎఫ్ బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ రే, ఫాక్స్ న్యూస్ తో మాట్లాడుతూ.. కోవిడ్-19 మహమ్మారి మూలం గురించి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) సమాచారం సేకరించిందని.. అది వుహాన్ లోని ల్యాబ్ లో పుట్టిందేనని చెప్పారు. 2019 చివర్లో వుహాన్ పట్టణంలోనే కరోనా మహమ్మారి మొదలైంది. అయితే, ఎఫ్ బీఐ ప్రకటనతో చైనా విభేదించింది. ఇది బీజింగ్ కు వ్యతిరేకంగా చేస్తున్న దుష్ప్రచారంగా పేర్కొంది.