హైద‌రాబాద్ చేరుకున్న రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము..స్వాగతం పలికిన సీఎం

శీతాకాల విడిది కోసం రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము హైద‌రాబాద్ చేరుకున్నారు. ఈ క్ర‌మంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాష్ట్ర‌ప‌తికి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప‌లువురు స్వాగ‌తం ప‌లికారు.

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఐదు రోజుల పాటు బొల్లారం లోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేయనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ముర్ము వెళ్లనున్నారు. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరిగి ఈ నెల 23వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ ఐదు రోజుల్లో రాష్ట్ర‌ప‌తి వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌నున్నారు.

మంగళవారం (రేపు) హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసు అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బొల్లారం నుంచి బేగంపేట రూట్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.