బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు రాజ్యసభ సీటు

బిజెపి అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు చెందిన ఓబీసీ నేత డాక్టర్ కోవా లక్ష్మణ్ (కె.లక్ష్మణ్)ను పెద్దల సభకు పంపేందుకు నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బార్ నఖ్వీకి మరోసారి నిరాశ ఎదురైంది. రాజ్యసభ అభ్యర్థుల రెండు జాబితాల్లోనూ నఖ్వీకి చోటు దక్కలేదు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు డాక్టర్ లక్ష్మణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. బీజేపీకి 8 మంది రాజ్యసభ సభ్యులకు అవకాశం ఉండగా.. ఇప్పటికే ఆరుగురిని ప్రకటించింది. తాజాగా సోమవారం (మే 30) రాత్రి మరో ఇద్దరి పేర్లను ప్రకటించింది. తెలంగాణకు చెందిన డాక్టర్ లక్ష్మణ్‌కు యూపీ నుంచి అవకాశం కల్పించగా , లక్ష్మణ్‌తో పాటు మిత్లేష్ కుమార్‌ను యూపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించారు. కర్ణాటక, మధ్యప్రదేశ్ నుంచి ఒక్కరు చొప్పున మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు.

డాక్టర్ లక్ష్మణ్ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. గతంలో (బండి సంజయ్ కంటే ముందు) బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగానూ గెలుపొంది శాసనసభలో బీజేపీ తరఫున తన గళం వినిపించారు. లక్ష్మణ్‌తో పాటు 8 మంది రాజ్యసభ అభ్యర్థులు మంగళవారం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడంతో డాక్టర్ లక్ష్మణ్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.