మెట్రో, ఫార్మా సిటీనీ రద్దు చేయడం లేదదుః సిఎం రేవంత్ రెడ్డి

కొత్తగా ప్రతిపాదించే మెట్రో లైన్లు తక్కువ ఖర్చుతో పూర్తవుతాయి.. రేవంత్ రెడ్డి

cm-revanth-reddy

హైదరాబాద్‌ః కొత్తగా ప్రతిపాదించే మెట్రో లైన్లు తక్కువ ఖర్చుతోనే పూర్తవుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ… మెట్రో, ఫార్మా సిటీని రద్దు చేయడం లేదని స్పష్టం చేశారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లో మెట్రో మార్గాన్ని తగ్గిస్తామని తెలిపారు. బీహెచ్ఈఎల్ నుంచి విమానాశ్రయానికి 32 కిలో మీటర్ల దూరం ఉంటుందని… ఈ క్రమంలో ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా విమానాశ్రయానికి మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు మెట్రోను పొడిగిస్తామన్నారు.

మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామని తెలిపారు. గచ్చిబౌలి నుంచి మెట్రోలో విమానాశ్రయానికి వెళ్లే వారు దాదాపు ఉండరని పేర్కొన్నారు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్ మీదుగా చాంద్రాయణగుట్ట వద్ద విమానాశ్రయానికి వెళ్లే మెట్రో మార్గానికి లింక్ చేస్తామన్నారు. ఫార్మా సిటీని రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లుగా మారుస్తామన్నారు. కొత్తగా ప్రతిపాదించే మెట్రో లైన్లను తక్కువ ఖర్చుతో పూర్తి చేస్తామన్నారు.