నేడు నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ పర్యటన

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు (సోమవారం) నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవంతో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. తర్వాత గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.

మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో 2:30 నిమిషాల‌కు నిజామాబాద్ చేరుకోనున్న కేసీఆర్.. టిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని అధ్యక్ష సీటులో కూర్చోబెట్టనున్నారు. అనంతరం నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. పూజల అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డిని సీటులో కూర్చోపెట్టనున్నారు. నిజామాబాద్ బైపాస్ రోడ్డు ప్రాంతంలో 25 ఎకరాల విస్తీర్ణంలో 60 కోట్ల వ్యయంతో కలెక్టరేట్‌ భవనం నిర్మించారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలతో జిల్లా కేంద్రం గులాబీ మయమైంది.