మనం స్వప్నించి, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు దశాబ్ది ముంగిట నిలిచిందిః సిఎం కెసిఆర్‌

cm-kcr-speech-in-secretariat-for-telangana-formation-day

హైదరాబాద్‌ః ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో సిఎం కెసిఆర్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధనకు ప్రాణాలర్పించిన త్యాగమూర్తులకు నివాళులు అర్పించారు. ఒకసారి పోరాట చరిత్ర, అభివృద్ధి ప్రస్తానాన్ని తలచుకుందామని, భవిష్యత్తు పురోగమనానికి మహోన్నతమైన ప్రేరణగా మలుచుకుందామన్నారు. ‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభసందర్భంలో ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. మనం స్వప్నించి, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు దశాబ్ది ముంగిట నిలిచిన ఉజ్వల సందర్భంలో 60 ఏండ్ల పోరాట చరిత్రనీ, పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్నీ ఘనంగా తలుచుకుందాం. భవిష్యత్తు పురోగమనానికి మహోన్నతమైన ప్రేరణగా మలుచుకుందాం.

ప్రజల అభీష్టానికి భిన్నంగా తెలంగాణను ఆంధ్రాప్రాంతంతో కలిపి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ ప్రజలు తమ అసమ్మతిని నిరంతరం తెలియజేస్తూనే వచ్చారు. 1969లో ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమం రక్తసిక్తమైంది, దారుణమైన అణచివేతకు గురైంది. 1971 లో జరిగిన ఎన్నికల్లో ప్రత్యేక తెలంగాణ డిమాండ్ కు మద్దతుగా ప్రజాతీర్పు వెలువడినప్పటికీ.. దానిని ఆనాటి కేంద్ర ప్రభుత్వం గౌరవించలేదు. ఫలితంగా తెలంగాణ సమాజంలో నాడు తీవ్ర నిరాశా నిస్పృహలు ఆవరించాయి. ఉద్యమాన్ని రగిలించేందుకు కొన్ని ప్రయత్నాలు జరిగినా.. నాయకత్వం మీద విశ్వాసం కలగకపోవడంవల్ల, సమైక్య పాలకుల కుట్రల వల్ల ఆ ప్రయత్నాలు ఫలించలేదు. 2001 వరకూ తెలంగాణలో నీరవ నిశ్శబ్దం రాజ్యమేలింది. ‘ఇంకెక్కడి తెలంగాణ’ అనే నిర్వేదం జనంలో అలుముకున్నది. ఆ నిర్వేదాన్ని, నిస్పృహని బద్దలు కొడుతూ 2001లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించే చారిత్రాత్మక పాత్ర నాకు లభించినందుకు నా జీవితం ధన్యమైంది.

రాష్ట్ర పథకాల పట్ల దేశమంతటా ఆదరణ కనిపిస్తోందని తెలంగాణ కెసిఆర్‌ అన్నారు. ‘‘సంక్షేమంలో రాష్ట్రం స్వర్ణ యుగాన్ని ఆవిష్కరించింది. సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం అనేదే మా నినాదం. తాగునీటి కష్టాలకు మిషన్ భగీరథ చరమగీతం పాడింది. మన పల్లెలకు జాతీయస్థాయి అవార్డులు వస్తున్నాయి. దశాబ్ది వేడుకల వేళ పోడు భూములకు పట్టాలు ఇస్తాం. పోడు భూములకూ రైతుబంధు పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటాం. నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణ..’’ అని కెసిఆర్‌ వ్యాఖ్యానించారు.