తెలంగాణ రాష్ట్రం కాక‌పోతే ఆసిఫాబాద్ జిల్లా కాక‌పోయేదిః సిఎం కెసిఆర్‌

CM KCR Public Meeting at Asifabad

హైదరాబాద్‌ః ఆసిఫాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో సిఎం కెసిఆర్ పాల్గొని కోవా ల‌క్ష్మీకి మ‌ద్ద‌తుగా ప్ర‌సంగించారు. ఆసిఫాబాద్ జిల్లా కావ‌డంతోనే.. మెడిక‌ల్ కాలేజీతో పాటు వంద‌లాది ప‌డ‌క‌ల‌తో హాస్పిట‌ల్ కూడా వ‌చ్చింద‌ని, దాంతో మ‌న్యం బిడ్డ‌ల‌కు మంచి జ‌రిగింద‌ని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కాక‌పోతే ఆసిఫాబాద్ జిల్లా కాక‌పోయేది. ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసినా ఎవ‌రూ కూడా జిల్లా చేయ‌లేదు. మారుమూల ప్రాంతం ఆసిఫాబాద్ జిల్లా అయిత‌ద‌ని క‌ల‌లో కూడా ఎవ‌రూ అనుకోలేదు. కానీ ఇవాళ బిఆర్ఎస్ గ‌వ‌ర్న‌మెంట్ ఉంది కాబ‌ట్టి, గిరిజ‌న బిడ్డ‌ల‌కు, పేద వ‌ర్గాల‌కు న్యాయం జ‌ర‌గాల‌ని జిల్లా చేశాం. మీరంద‌రూ చూస్తుండ‌గానే క‌లెక్ట‌రేట్, ఎస్పీ ఆఫీసు క‌ట్టుకున్నాం. నేనే ప్రారంభించాను. ఆసిఫాబాద్ జిల్లా కావ‌డంతో ఒక మంచి మేలు జ‌రిగింది. వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే గుట్ట మీద గూడెం, గుట్ట కింద వాగుల నీళ్లు.. ఆ క‌లుషిత నీళ్లు తాగి అంటురోగాలు వ‌చ్చేవి. గిరిజ‌న బిడ్డ‌లు రోగాల బారిన ప‌డేవారు. మంచం ప‌ట్టిన మ‌న్యం అని వార్త‌లు వ‌చ్చేవి. ఇవాళ ఆ బాధ పోయింది. ఆసిఫాబాద్‌లో మెడిక‌ల్ కాలేజీ వ‌స్త‌ద‌ని ఎవ‌రూ అనుకోలేదు. మెడిక‌ల్ కాలేజీతో పాటు వంద‌లాది ప‌డ‌క‌ల హాస్పిట‌ల్ కూడా రావ‌డంతో మ‌న్యం బిడ్డ‌ల‌కు మంచి జ‌రిగింది అని కెసిఆర్ తెలిపారు.

తెలంగాణ కోసం పోరాటం చేసిన మ‌హాయోధుడు.. జ‌ల్, జంగ‌ల్, జ‌మీన్ నినాదంతో కొట్లాడిన మ‌హాయోధుడు మ‌న కొమ్రం భీం. ఆయ‌న పేరు మీద కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అని నామ‌క‌ర‌ణం చేశాను. ఈ విష‌యం మీ అంద‌రికీ తెలుసు. కొమ్రం భీం పోరాటం చేసిన స్థ‌లంలో కెరెమెరి ఘాట్స్‌ను ఏ గ‌వ‌ర్న‌మెంట్ కూడా ప‌ట్టించుకోలేదు. 2014 త‌ర్వాత బిఆర్ఎస్ గ‌వ‌ర్న‌మెంట్ వ‌చ్చిన త‌ర్వాత‌ స్వ‌యంగా నేనే అక్క‌డికి వెళ్లి.. కొమ్రం భీం స్మార‌క చిహ్నం నిర్మాణం చేసుకున్నాం. ఇవ‌న్నీ మీ కండ్ల ముందున్నాయి.. జ‌రిగాయి అని కెసిఆర్ తెలిపారు.