మునుగోడు పోలింగ్.. ఉదయం 9 గంటల వరకు 11.2శాతం పోలింగ్

హైదరాబాద్ః మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం తొమ్మిది గంటల వరకు పోలింగ్ శాతం 11.2గా నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. నారాయణపురం మండలంలోని అల్లందేవి చెరువు గ్రామంలో బూత్ నెంబర్ 82లో ఈవీఎం మొరాయించగా.. దాదాపు అరగంట పాటు పోలింగ్ నిలిచిపోయింది. చండూరులో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ఓ ఇంట్లో స్థానికేతరులను ఉన్నారంటూ.. టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరగ్గా.. స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.
మరో వైపు నారాయణపురం పరిధిలోని లింగవారిగూడెంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి దంపతులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. చండూరు మండలం ఇడికూడలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఓటు వేశారు. ఉదయం నుంచి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని సీఈవో వికాస్ రాజ్ పేర్కొన్నారు. రెండుచోట్ల ఈవీఎంలో సమస్యలు తలెత్తితే సరిచేశామన్నారు. నిన్న రాత్రి పలుగ్రామాల్లో తనిఖీలు జరిగాయని, స్థానికేతరులు లేకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/