మన బాసులు ఢిల్లీలో ఉండరు… తెలంగాణ ప్రజలే మా బాసులుః సిఎం కెసిఆర్‌

ఎవరో డబ్బు ఇచ్చారనో.. ఎవరో చెప్పారనే గుడ్డిగా ఓటు వేయవద్దన్న కెసిఆర్

cm-kcr-praja-ashirvada-sabha-at-chennur

చెన్నూరుః రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క తదితర కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలు మీరు చూశారని, అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా ఇవ్వవద్దని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. మంగళవారం చెన్నూరులో పార్టీ అభ్యర్థి బాల్క సుమన్ తరఫున నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతూ… ఎవరో డబ్బులు ఇచ్చారనో… మా మామ చెప్పాడనో… మా చిన్నాన చెప్పాడనో గుడ్డిగా మనం ఓటు వేయవద్దన్నారు. బిఆర్ఎస్ నుంచి చెన్నూరు నుంచి బాల్క సుమన్ నిలబడగా… కాంగ్రెస్ నుంచి ఇటీవలే కండువా మార్చిన వ్యక్తి… ముసుగు మార్చుకొని పార్టీ మారిన వ్యక్తి పోటీ చేస్తున్నారని వివేక్ వెంకటస్వామిని ఉద్దేశించి అన్నారు.

ఓటు వేసే ముందు ఓటర్లు అభ్యర్థితో పాటు పార్టీ నడవడిక కూడా తెలుసుకొని ఓటు వేయాలన్నారు. మీ ఓటు అయిదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. బిఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమని, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం ఉందన్నారు. తమ బాసులు ఢిల్లీలో ఉండరని, తెలంగాణ ప్రజలే తమకు బాసులు అన్నారు. ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు టిక్కెట్ ఇచ్చే పవర్ కూడా లేదన్నారు. ఏ ప్రభుత్వం ఉంటే భవిష్యత్తు బాగుంటుందో చూసుకోవాలన్నారు. ఉన్న తెలంగాణను కలిపింది కాంగ్రెస్ అని, దీంతో తెలంగాణ ప్రజానీకం దశాబ్దాల పాటు కన్నీరు కార్చిందన్నారు. తెలంగాణ నుంచి బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లామని, దీనికి కారణంగా కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. సింగరేణి పూర్తి తెలంగాణ కంపెనీ అయితే చేతకాని దద్దమ్మ కాంగ్రెస్ పార్టీ 49 శాతం వాటాను కేంద్రానికి అప్పగించిందన్నారు.

కాంగ్రెస్ హయాంలో ఉద్యోగుల వాటా 18 శాతం అయితే మనం 32 శాతానికి పెంచామన్నారు. సింగరేణి కంపెనీని ముంచిందే కాంగ్రెస్ అన్నారు. ప్రధాని మోదీకి ప్రయివేటైజేషన్ పిచ్చి పట్టుకుందన్నారు. మన సింగరేణిని, మన బొగ్గును మనం ప్రయివేటు ఎందుకు చేయాలన్నారు. కాంగ్రెస్ ఎప్పుడైనా రైతుల గురించి ఆలోచించిందా? అని ప్రశ్నించారు. కాబట్టి ఆలోచించి ఓటు వేయాలన్నారు. రైతుబంధు పదం పుట్టించిందే కెసిఆర్ ప్రభుత్వమన్నారు. కాంగ్రెస్ నేతలు రైతుబంధు వృథా అంటున్నారని విమర్శలు గుప్పించారు. ఎవరి భూమిపై వారికే హక్కు ఉండాలని తాము ధరణి పోర్టల్ తీసుకు వచ్చామన్నారు. ఇప్పుడు రైతు భూమిని ఇతరులకు మార్చే శక్తి ముఖ్యమంత్రికి కూడా లేదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో వేస్తామని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలు అంటున్నారన్నారు. మళ్లీ దళారుల రాజ్యం తీసుకు రావడానికి ధరణి పోర్టల్‌ను తీసేద్దామా? అన్నారు. ఎవరో డబ్బులు ఇచ్చారని ఓటు వేసి నష్టపోవద్దని సూచించారు. దేశం మొత్తంలోనే రైతుకు 24 గంటల విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. రైతు బంధు వృధా అని, విద్యుత్ ఐదు గంటలు ఇస్తామని, ధరణి పోర్టల్‌ను తీసేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని, ఈ మాటలు మీరు కూడా విన్నారని కాబట్టి ఆ పార్టీకి డిపాజిట్ కూడా రావొద్దన్నారు.

సూట్ కేసులతో వచ్చే దోపిడీదారులు కావాలా? బాల్కసుమన్ లాంటి వారు కావాలా? నిర్ణయించుకోవాలన్నారు. సూటుకేసులతో వచ్చే వారిని తరిమి కొట్టాలన్నారు. గోల్ మాల్ గాళ్ళను ప్రజలు గోల్ మాల్ చేయాలన్నారు. ఎవరైనా వచ్చి ఓటు వేయమంటే మొహమాటానికి సరే అనాలని… కానీ చేసే పని చేయాలన్నారు. దళితులను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని, కానీ మేం వారికి దళితబంధు ఇస్తున్నామన్నారు. ఆలోచించి ఓటు వేయకుంటే ప్రమాదమన్నారు. బాల్క సుమన్‌ను 60వేల మెజార్టీతో గెలిపిస్తే డిగ్రీ కాలేజీ తప్పనిసరిగా ఇస్తామన్నారు. బాల్క సుమన్ తనకు బిడ్డలాంటి వాడని, ఆయన రెండు పనులు చేస్తాడని, ఇక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తాడని, మళ్లీ పార్టీ కోసం హైదరాబాద్‌లో పని చేస్తారన్నారు. ముఖ్యమంత్రి దగ్గరగా ఉండే బాల్క సుమన్‌ను గెలిపించాలన్నారు. పార్టీలు మార్చి, సూటుకేసులు పట్టుకొచ్చే వారిని గెలిపించవద్దన్నారు.