నేపాల్‌ భూకంపం.. ప్రజలు అప్రమత్తంగా ఉండండిః నిపుణుల హెచ్చరిక

We should be prepared.. Expert warns of active seismic belt in Nepal after 6.4 quake

న్యూఢిల్లీః హిమాలయ దేశం నేపాల్‌ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. శుక్రవారం నేపాల్‌లోని వాయువ్య ప్రాంతంలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రివేళ 11.32 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 6.4గా నమోదయిందని నేషనల్‌ ఎర్త్‌క్వేక్‌ మెజర్‌మెంట్‌ సెంటర్‌ తెలిపింది. ఈ ఘటనలో సుమారు 140 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జాజర్‌కోట్‌ జిల్లాలోని లామిదండా ప్రాతంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. నెల రోజుల వ్యవధిలో నేపాల్‌లో భూకంపం రావడం ఇది మూడోసారి. దీనిప్రభావంతో ఉత్తర భారతదేశంలోనూ ప్రకంపణలు చోటు చేసుకున్నాయి. సుమారు 15 సెకన్లపాటు భూమి కంపించింది. శుక్రవారం రాత్రి 11.32 గంటలకు ఢిల్లీ, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి పరుగులు తీశారు. వరుస భూకంపాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గతంలో వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ లో పనిచేసిన భూకంప శాస్త్రవేత్త అజయ్ పాల్ కీలక సూచనలు జారీ చేశారు. నేపాల్‌లోని సెంట్రల్ బెల్ట్ ప్రాంతాన్ని ‘భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతంగా’ గుర్తించినట్లు చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా, అప్రమత్తంగా.. సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.