బీహార్ పర్యటన లో మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ ను కలిసిన సీఎం కేసీఆర్

బీహార్ పర్యటన లో మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ ను కలిశారు ముఖ్యమంత్రి కేసీఆర్.లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను పరామర్శించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. గల్వాన్‌ అమరవీరుల కుటుంబాలతోపాటు హైదరాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసేందుకు బీహార్ వెళ్లిన కేసీఆర్..నేరుగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో భేటీ అయ్యారు. అనంతరం బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేశారు.

ఈ సందర్బంగా కేసీఆర్..మోడీ సర్కార్ ఫై నిప్పులు చెరిగారు. బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్.. ఎనిమిదేళ్ల మోడీ పాలనలో దేశం పూర్తిగా నష్టపోయిందని, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనమైందని చెప్పారు. రైలుతు, పేదలు, మహిళలు ఏ ఒక్కరికీ మోడీ సర్కారు ఏం చెయ్యలేదన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న నదుల్లో 70 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, కానీ వాటిని ఉపయోగించుకునే ఆలోచన మాత్రం కేంద్రానికి లేదని విమర్శించారు. దేశరాజధాని ఢిల్లీలో కూడా తాగునీరు, విద్యుత్ సమస్యలు తీర్చలేదని ఎద్దేవా చేశారు.

ఎయిర్‌పోర్టులు, రైల్వేలు అన్నీ ప్రైవేటీకరిస్తున్నారని, ప్రతిష్టాత్మక సంస్థ ఎల్‌ఐసీని ప్రైవేటీకరణ చేయడం ఏంటని నిలదీశారు. మేకిన్ ఇండియా అనేది వట్టిమాటేనని, అన్ని వస్తువులు ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతూనే ఉన్నాయని చెప్పారు. ఒక పక్క బేటీ బచావో బేటీ పడావో అంటున్నారని, కానీ మరో పక్క అత్యాచారాలు పెరిగిపోతున్నాయని .. మేకిన్ ఇండియా అన్నారని, కానీ గాలి పటాలు ఎగరేసే మాంజా కూడా చైనా నుంచే దిగుమతి అవుతోందని విమర్శించారు.