రెండో విడత కంటి వెలుగును ప్రారంభించిన సీఎం కేసీఆర్

ఖమ్మంలో సీఎం కేసీఆర్ రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం కేసీఆర్ తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు పినరయి విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ఈ ప్రారంభ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

యాదగిరి గుట్ట నుండి హెలికాఫ్టర్ లో ఖమ్మం కు చేరుకున్న ముఖ్యమంత్రులు..ముందుగా నూతన కలెక్టరేట్‌ ను ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రెండో విడుత కంటి వెలుగుకు శ్రీకారం చుట్టారు. కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్.. మంత్రులను, ఎంపీలను సీఎంలకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కంటి వెలుగు లబ్ధిదారులు ధరవాత్‌ బిచ్చమ్మ, మందా అన్నపూర్ణ, రామనాథం, కోలం జ్యోతి, వెంకటేశ్వర్లు, షేక్‌ గౌసియా బేగంకు నేతలు సీఎం పినరయి విజనయ్‌, అరవింద్‌ కేజ్రీవాల్ భగవంత్‌ మాన్‌, సీఎం కేసీఆర్‌, అఖిలేశ్‌ యాదవ్‌, డీ రాజా కంటి అద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా కంటి వెలుగు కార్యక్రమం గురించి జాతీయ నేతలకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివరించారు.