కేసీఆర్ పోరాటానికి మా మద్దతు ఉంటుంది – కేరళ సీఎం పినరయి విజయన్

తెలంగాణ సీఎం కేసీఆర్ స్థాపించిన బిఆర్ఎస్ కు మా సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు కేరళ సీఎం పినరయి విజయన్. బిఆర్ఎస్ పార్టీ ప్రకటన తర్వాత మొదటిసారి ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు సీఎం కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నేతలు , కార్య కర్తలు ఈ సభకు హాజరయ్యారు. అలాగే కేరళ సీఎం పినరాయి విజయన్‌, ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ లతో పాటు సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా పాల్గొననున్నారు.

గత రాత్రి హైదరాబాద్ కు చేరుకున్న వీరు..ఉదయం యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం యాదగిరి గుట్ట నుండి హెలికాఫ్టర్ లో ఖమ్మం కు చేరుకున్న ముఖ్యమంత్రులు..ముందుగా నూతన కలెక్టరేట్‌ ను ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రెండో విడుత కంటి వెలుగుకు శ్రీకారం చుట్టారు. కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్.. మంత్రులను, ఎంపీలను సీఎంలకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు.

ఇక ఈ సభలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ..కేసీఆర్ చేపట్టిన పోరాటానికి మా మద్దతు ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు చాలా మంచి కార్యక్రమం. సంక్షేమ పథకాలను కేరళలోనూ అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలకు పెనుముప్పు పొంచి ఉందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ చేపట్టిన పోరాటానికి మా మద్దతు ఉంటుందన్నారు. ఈ సభ దేశానికి ఓ దిక్సూచీ లాంటిదన్నారు.

తెలంగాణ సాయుధ పోరాటంతో రాచరికాన్ని తరిమికొట్టారని గుర్తు చేశారు. పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకంగా మోడీ పాలన సాగుతుందని విమర్శించారు. మోడీ కార్పొరేట్లకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని , దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టి.. విదేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు . రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపైనా కేంద్రం పెత్తనం చేస్తోంది. కీలక విషయాల్లో రాష్ట్రాలను సంప్రదించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్‌భవన్‌లు బీజేపీ కార్యాలయాలుగా మారాయని విమర్శించారు. అసెంబ్లీలను బలహీనం చేసేలా బిల్లుల్ని తొక్కిపెడుతున్నారని మండిపడ్డారు.