మైనంపల్లి హన్మంతరావు ను హెచ్చరించిన సీఎం కేసీఆర్

మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు..మంత్రి హరీష్ రావు ఫై చేసిన వ్యాఖ్యలపట్ల సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. మైనంపల్లి పార్టీ ఆదేశాలు పాటిస్తే మంచిదని.. పాటించకపోతే ఇక ఆయనిష్టమన్నారు. పార్టీ తరఫున పోటీ చేస్తారా? లేదా? ఆయనకే వదిలేశామని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన సందర్భంగా మీడియా ప్రతినిధులు మైనంపల్లి గురించి అడగగా.. కేసీఆర్ కూడా చురకలు అంటించారు. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మైనంపల్లి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మెదక్‌లో ప్రచారం చేయడానికి హరీశ్ రావు ఎవరని ప్రశ్నించారు. తన నియోజకవర్గంని వదిలి మా జిల్లాలో పెత్తనం చేస్తున్నాడని మండిపడ్డారు.

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మల్కాజ్‌గిరి నుంచి తాను, మెదక్ నుంచి తన కుమారుడు రోహిత్ పోటీ చేస్తారని స్పష్టం చేశారు. అవసరమైతే సిద్దిపేటలో తన తడాఖా చూపిస్తా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘హరీష్ రావు గతం గుర్తించు కోవాలి. తన నియోజకవర్గంని వదిలి మా జిల్లాలో పెత్తనం చేస్తున్నాడు. ఓ డిక్టేటర్‌లా ప్రవర్తిస్తున్నాడు. హరీష్ అక్రమంగా లక్ష కోట్లు సంపాదించాడు. సిద్దిపేటలో హరీష్ రావు అడ్రెస్ గల్లంతు చేస్తాను. రాజకీయంగా ఎంతో మందిని అణిచివేశాడు. మెదక్‌లో నా తనయుడు.. మల్కాజిగిరిలో నేను పోటీ చేస్తాను. మెదక్‌లో నా తనయుడుని కచ్ఛితంగా గెలిపించుకుంటాను. నేను బీఆర్ఎస్‌లోనే ఉన్నాను.. నాకు పార్టీ ఇప్పటికే టికెట్ ప్రకటించింది. వారి కుటుంబంలో కూడా చాలా మందికి టికెట్ ఇచ్చారు. మా ఇద్దరికి టికెట్ ఇస్తేనే పోటీ చేస్తాం’ అని మైనంపల్లి హాట్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ఫై సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్ ఫైర్ అయ్యారు.