మరికాసేపట్లో ‘ఫ్యామిలీ డాక్టర్’ను ప్రారంభించనున్న సీఎం జగన్

సీఎం జగన్ చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. అనంతరం కావూరు గ్రామంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఉదయం 10 గంటలకు పల్నాడు జిల్లాకు చేరుకుంటారు. డాక్టర్‌ వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ సెంటర్‌ని పరిశీలిస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన ఫ్యామిలీ ఫిజీషియన్‌ కాన్సెప్ట్‌ స్టాల్స్‌ను సందర్శిస్తారు. అధికారులను అడిగి పలు వివరాలను తెలుసుకుంటారు.

ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర సర్కారు.. అందులో భాగంగా ఫ్యామిలీ డాక్టర్ అనే విధానాన్ని ఆవిష్కరించనుంది. వైద్య, ఆరోగ్య సేవలు రాష్ట్రం నలుమూలల విస్తరించాలన్న ఉద్దేశంతో పాటు ప్రతి ఒక్కరికీ స్పెషలిస్టు డాక్టర్ల సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రారంభించనుంది. దానికి ఫ్యామిలీ డాక్టర్ అనే పేరును పెట్టింది. ఈ విధానాన్ని రాష్ట్ర సర్కారు కొన్ని రోజులుగా దశలవారీగా ట్రయల్ రన్స్ నిర్వహిస్తూ వస్తోంది. అందులో మంచి ఫలితాలు రావడంతో ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేయాలని జగన్ ప్రభుత్వం సంకల్పించింది.