వైజాగ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై మళ్లీ రాళ్ల దాడి ..4 గంటల ఆలస్యం

వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల ఫై రాళ్ల దాడులు ఆగడం లేదు. రైళ్ల ఫై దాడి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఓ పక్క రైల్వే అధికారులు హెచ్చరిస్తున్న ఆకతాయిలు మాత్రం ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట రాళ్ల దాడి చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి వైజాగ్ – సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఫై రాళ్ల దాడి జరిగింది.

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వస్తుండగా బుధవారం (ఏప్రిల్ 5) నాడు ఈ ఘటన జరిగింది. ఖమ్మం – విజయవాడ మధ్య గుర్తు తెలియని వ్యక్తులు అద్దాల్ని పగలగొట్టారు. అలాగే రైలు విశాఖపట్నానికి చేరుకుంది. పగిలిన అద్దాన్ని రిపేర్ చేయడానికి నాలుగు గంటల సమయం పడుతుందని రైల్వేశాఖ ప్రకటించింది. దీనివల్ల విశాఖపట్నం నుంచి ఉదయం 5:45 కి బయలు దేరాల్సిన వందేభారత్ ట్రైన్ 9:45 కి బయలు దేరుతుందని వాల్తేరు సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రూట్లో నడుస్తున్న ఈ రైలు పైన గత మూడు నెలల కాలంలో ఇది మూడోసారి రాళ్ల దాడి జరిగింది. అంతకుముందు జనవరి నెలలో విశాఖలో మెయింటెనెన్స్ సందర్భంగా రాళ్ల దాడి జరిగింది. కోచ్ కేర్ సెంటర్ కు వెళ్తున్న సమయంలో కంచరపాలెంలో జరిగిన ఈ ఘటనలో గ్లాస్ పేన్ పగిలిపోయింది. ఇప్పుడు మూడోసారి దాడి జరిగింది.