రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్

అమరావతి: సీఎం జగన్ రైతు భరోసా నిధులను విడుదల చేశారు. రైతు భరోసా- పీఎం కిసాన్‌ కింద మూడోవిడత పెట్టుబడి సాయం జమ నిధులు మొత్తం 50,58,489 మందికి రూ.1,036 కోట్లు జమ చేశారు. సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి ఈ మొత్తాన్ని రైతు భరోసా సాయాన్ని బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ మొత్తంతో కలిపి 2021–22 సీజన్‌లో రూ.6,899.67 కోట్లు జమ కానుండగా, గడిచిన మూడేళ్లలో ఈ పథకం కింద రూ.19,812.79 కోట్లు పెట్టుబడి సాయం అందిస్తోంది. వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది.

వైస్సార్సీపీ ఎన్నికల హామీలో భాగంగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 13,500 సాయం విడతల వారీగా అందిస్తోంది. ఇందులో మొదటి విడతగా ఖరీఫ్‌ పంట వేసే ముందు అంటే మే నెలలో రూ. 7,500, రెండవ విడతగా అక్టోబర్‌ నెల ముగిసేలోపే ఖరీఫ్‌ పంట కోత సమయం, రబీ అవసరాల కోసం రూ. 4,000, మూడవ విడతగా ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి వేళ జనవరి నెలలో రూ. 2,000 చొప్పున ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/