విద్యుత్ తీగలు తెగిపడి మరణించిన వారికీ రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్

అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం దర్గాహోన్నూరు విషాద ఘటన ఫై సీఎం జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్‌ ఫై వెళ్తున్న కూలీలఫై విద్యుత్ తీగలు తెగిపడటంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా..మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఫై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్..మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులను, స్థానిక నేతలను ఆదేశించారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా.. వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని సూచించారు.

ఈ ఘటనపై ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించడంతోపాటు.. మృతుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని.. వారు ధైర్యంగా ఉండాలని వ్యాఖ్యానించారు.

దర్గాహోన్నూరు గ్రామానికి చెందిన కూలీలు పొలంలో మొక్కజొన్న కంకుల కోతకు వెళుతుండగా విద్యుత్ మెయిన్ వైర్లు ఒక్కసారిగా తెగిపడ్డాయి. దీంతో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. సంఘటనా స్థలిలో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. వెంటనే సమీప గ్రామస్తులు అక్కడకు చేరుకుని తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒకే గ్రామానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో దర్గాహోన్నూరులో విషాదఛాయలు అలముకున్నాయి.